: మరోసారి పడగవిప్పిన జాత్యహంకారం....భారతీయుడి స్టోర్ కి నిప్పుపెట్టిన వైనం!
అమెరికాలో మరోసారి జాత్యహంకారం పడగవిప్పింది. శ్రీనివాస్ కూచిభొట్ల హత్యానంతరం మరో ఎన్నారైపై దాడి జరగగా, తాజగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్ కు రిచర్డ్ లాయిడ్ (64) అనే వ్యక్తి నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. గతంలో భారతీయులపై దాడులు జరగగా, ఇప్పుడు వారి ఆస్తులపై దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. పోలీసులందించిన వివరాల ప్రకారం... రిచర్డ్ లాయిడ్ (64) ఎన్నారైకి చెందిన ఓ స్టోర్ కు నిప్పు పెట్టాడు.
అనంతరం చేతులు వెనక్కి పెట్టుకొని స్టోర్ తగులబడుతుంటే దర్జాగా నవ్వుతూ నిల్చున్నాడు. తనను అరెస్టు చేసుకోవచ్చని పోలీసులకు తెలిపాడు. తమ దేశంలో అరబ్ దేశాలకు చెందిన ముస్లింలు అస్సలు ఉండొద్దని ఆయన ఆకాంక్షించాడు. అందులో భాగంగానే ఆ స్టోర్ ను తగులబెట్టానని ఆయన ప్రకటించారు. స్టోర్ భారతీయులదని తనకు తెలియదని అన్నాడు.
దీనిపై పోలీసు అధికారి మస్కారా మాట్లాడుతూ, తమ దేశ పౌరుడికి అరబ్ ముస్లింలపై కోపం ఉండటం దురదృష్టకరమని అన్నారు. అరబ్స్ అనుకుని భారతీయ సంతతి పౌరులపై దాడికి దిగడం మరింత బాధాకరమని ఆయన తెలిపారు. శ్రీనివాస్ కూచిభొట్లపై అకారణంగా దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాగా, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరచగా 30 వేల డాలర్ల బాండ్ సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.