: హైదరాబాదు మెట్రో రైలు వంతెనపై నుంచి కిందపడ్డ చువ్వ....కోమాలో మహిళ


హైదరాబాదులోని మెట్రో రైలు నిర్మాణ వంతెన పనులు మహిళ ప్రాణాల మీదికి తెచ్చాయి. యాఖుత్‌ పురా చమన్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ హఫీజ్‌, ఉజ్మా హఫీజ్‌ దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు. వీరి పెద్దకుమార్తె అఫ్షా ఫాతిమ ఖైరతాబాద్‌ లోని షాదాన్‌ కళాశాలలో ఎం.ఎస్సీ. జెనెటిక్స్‌ చదువుతోంది. కళాశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు షేక్‌ అబ్దుల్‌ హఫీజ్‌, ఉజ్మా హఫీజ్‌ (38) దంపతులు శనివారం ఉదయం బైక్‌ పై కళాశాలకు బయల్దేరారు. 11 గంటల ప్రాంతంలో వారు నాంపల్లి రైల్వేస్టేషన్‌ ముందు నుంచి బైక్‌ పై వెళ్తుండగా... ఆ మార్గంలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ వంతెన పై నుంచి ఇనుప చువ్వ కిందపడింది.

అది నేరుగా ప్రభాత్ హోటల్ వద్దకు చేరుకున్న షేక్‌ అబ్దుల్‌ హఫీజ్‌ వెనుక సీట్లో కూర్చొన్న ఉజ్మా హఫీజ్‌ తలపై పడింది. ముప్ఫై నలభై అడుగుల ఎత్తు నుంచి గునపంలాంటి చువ్వ పడటంతో ఆమె తలకు బలమైన గాయం ఏర్పడి, రక్తపుమడుగులో కుప్పకూలింది. దీంతో ఆమెను స్థానికుల సాయంతో మెడ్విన్ ఆసుపత్రికి తరలించారు. క్షణక్షణానికి ఆమె ఆరోగ్యం దిగజారుతూ అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో ఎల్‌ అండ్‌ టి అధికారులు బాధితురాలికి కార్పొరేట్‌ వైద్యం చేయించేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆమె కోమాలోకి వెళ్లిపోవడంతో ఆపరేషన్ కు భారీ మొత్తం అవుతుందని షేక్ అబ్దుల్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News