: ఆ ఇంట్లో ఒక గదిలో శవం... మరో గదిలో వందల సంఖ్యలో పుర్రెలు!


శ్మశానంలో ఉండాల్సిన శవం, పుర్రెలు ఇంట్లో ఉంటే... తీవ్ర భయాందోళనలు కలగడం సర్వసాధారణం. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యం తమిళనాడులోని పెరంబలూరు వద్ద ఓ మాంత్రికుడి నివాసంలో కనిపించింది. ఆ ఇంటిని తనిఖీలు చేసిన పోలీసులు ఇది చూసి కాసేపు షాక్ అయ్యారు. దీంతో విచారణ కోసం ఆ ఇంట్లోని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే... పెరంబలూరులోని ఎంఎం నగర్‌ లో ఓ ఇంట్లో యువతిని నరబలి ఇచ్చి పూజలు జరుపుతున్నారని పోలీసులకు విశ్వసనీయ రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేసి షాక్ తిన్నారు.

ఆ ఇంట్లో కార్తికేయన్ (31), అతని భార్య నజీమా (26) నివాసం ఉంటున్నారు. ఇంట్లో ప్రవేశించిన పోలీసులకు ఓ గది నుంచి భరించరాని దుర్వాసన రావడంతో ఏంటది? అని అడగడంతో 5 వేల రూపాయలు పోసి కొనుక్కున్న శవమని చెప్పాడు. ఆ పక్కగదిలోకి వెళ్లిన పోలీసులకు వందల సంఖ్యలో పుర్రెలు కనిపించాయి. దీంతో వారందర్నీ నువ్వే హత్య చేశావా? అని అడగడంతో తాను మాంత్రికుడ్నని, ప్రేతాత్మలతో సంభాషిస్తానని సమాధానమిచ్చాడు. అఘోరా పూజలు చేస్తుంటానని తెలిపాడు. తన వద్దకు చాలా మంది వస్తుంటారని, తన కస్టమర్లలో ప్రముఖులు కూడా ఉన్నారని తెలిపాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం చుట్టుపక్కల తెలియడంతో అతని నివాసాన్ని, అతనిని చూసేందుకు భారీ ఎత్తున గుమిగూడారు. 

  • Loading...

More Telugu News