: గవర్నర్ ప్రసంగంలో అలాంటి పదం ఒక్కటైనా ఉందా?.. నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా.. కేసీఆర్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో అతిశయోక్తి పదం ఒక్కటంటే ఒక్కటున్నట్టు చూపించినా తాను ఐదంటే ఐదు నిమిషాల్లో రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్క అబద్ధం కూడా లేదని, అన్నీ వాస్తవాలే మాట్లాడారని అన్నారు. ఆయన మాట్లాడుతుంటే అరుపులు, పెడబొబ్బలు పెట్టారని, రన్నింగ్ కామెంట్లు కూడా చేశారని, 40 నిమిషాలు ఓపిక పట్టకపోతే ఎలా? అని ప్రతిపక్షాలను నిలదీశారు.
టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి గతంలో వ్యవహరించినట్టుగానే ఓ సభ్యుడు ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలాడని, నిబంధనల ప్రకారమే అతనిని సస్పెండ్ చేశామని వివరించారు. గత పదేళ్లలో కాంగ్రెస్ నిరుద్యోగులకు 24 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ గవర్నర్ ప్రసంగాన్ని ఎద్దేవా చేస్తున్నారని, లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న ఆయన ప్రసంగంలో అతిశయోక్తి కానీ, అబద్ధం కానీ ఉన్నట్టు నిరూపిస్తే తాను ఐదు నిమిషాల్లో రాజీ నామా చేస్తానని సవాల్ విసిరారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే లక్షల ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కేసీఆర్ వివరించారు.