: నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
ఈ రోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో సాధించిన భారీ విజయం కార్యకర్తలకు అంకితమని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆయా రాష్ట్రాల్లో తాము సాధించిన విజయం దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో పాటు మణిపూర్, గోవాల్లో కూడా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని ఈ ఫలితాల ద్వారా తెలుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ పట్ల కొందరు దుష్ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు మాత్రం ఆయనకే పట్టంగడుతున్నారని ఆయన అన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌లలో నాలుగింట మూడోవంతు మెజార్టీ వచ్చిందని అన్నారు.
ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని అమిత్ షా అన్నారు. యూపీ అభివృద్ధికి ప్రణాళికలు వేస్తామని చెప్పారు. మోదీ నాయకత్వానికి ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. ప్రజలందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ బీజేపీనే గెలిచిందని ఆయన అన్నారు.