: యూపీలో అవే ఫలితాలు.. 37 ఏళ్ల నాటి చరిత్ర పునరావృతం!
హిస్టరీ రిపీట్స్ అంటారు.. అంటే చరిత్ర పునరావృతమవుతుంటుంది. ఇప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 37 ఏళ్ల నాటి చరిత్ర పునరావృతమైంది. ప్రస్తుతం వచ్చిన ఫలితాలు 1980లో నాటి ఫలితాలను గుర్తు చేస్తున్నాయి. 1980లో ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి 309 స్థానాలలో గెలుపొందింది. అవే ఫలితాలు ప్రస్తుతం యూపీలో కనపడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం యూపీలో ఉన్న 403 స్థానాలకు గాను బీజేపీ 320 స్థానాల్లో ముందంజలో వుండగా, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 37 ఏళ్ల క్రితం 1980లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 309స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1985 మార్చి 10వరకు అధికారంలో కొనసాగింది.
అంతకుముందు 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఏకంగా 352 స్థానాలు దక్కించుకుంది. అప్పుడు కాంగ్రెస్ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. యూపీలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 1951లో కాంగ్రెస్ 388 స్థానాలు సొంతం చేసుకుంది. 2017వరకు ఏ పార్టీ ఆ మార్కును అందుకోకపోవడం గమనార్హం. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన ఎన్నికల్లో భాజపా నిర్ణయాన్ని ప్రజలు ఏమేరకు ఆమోదిస్తారో అని సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో యూపీలో తాజా ఫలితాలను విశ్లేషిస్తే నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు ఆమోదముద్ర వేసినట్లు కనిపిస్తుంది.