: ప్రమాదంలో తల్లిని కోల్పోయిన పిల్ల కోతి.. పొదివి పట్టుకుని ఏడుపు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రజలు


ప్రేమ, ఆప్యాయత, అనుబంధం.. మనుషుల్లోనే కాదు.. తమలోనూ ఉంటాయని నిరూపించిందో పిల్ల వానరం. ప్రమాదంలో తల్లిని కోల్పోయిన పిల్ల కోతి తల్లిని పట్టుకుని విలపించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించింది. తమిళనాడు-కర్ణాటక జాతీయ రహదారిపై ఎలంతూరు వద్ద శుక్రవారం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కోతిని వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అచేతనంగా పడి ఉన్న తల్లి వద్దకు చేరుకున్న పిల్ల కోతి తల్లిని పట్టుకుని కదిలించింది. తట్టి లేపింది. ఎంతకీ లేవకపోవడంతో దాని గుండెలపై చెవి ఆనించి గుండె చప్పుడు వింది. స్పందన లేకపోవడంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ  ఘటనను చూసిన వారి కళ్ల వెంట వారికి తెలియకుండానే నీళ్లు వచ్చాయి.


‘‘ప్రేమించిన వారిని కోల్పోతే అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. అది మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ఒకటే. తల్లిని పట్టుకుని ఏడుస్తున్న దానిని చూసి మా కళ్ల వెంట కూడా నీళ్లు వచ్చాయి’’ అని శరవణన్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పిల్ల వానరాన్ని బలవంతంగా అక్కడి నుంచి తరిమి తల్లి మృతదేహాన్ని తీసి గ్రామస్తులకు అప్పగించారు. వారు  దానికి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతదేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా పిల్ల కోతి వారిని వెంబడించింది. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే విచారంగా ఉండిపోయింది.

  • Loading...

More Telugu News