: పెరిగిన పాల ధర... లీటరుపై రూ. 3 పెంచిన మదర్ డైరీ
దేశంలోని చాలా ప్రాంతాల్లో పాలను సరఫరా చేస్తున్న మదర్ డైరీ, లీటరుపై రూ. 3 మేరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. గడచిన ఏడాది కాలంలో పాల ఉత్పత్తి ధర లీటరుకు రూ. 6 వరకూ పెరిగిందని, ఈ నేపథ్యంలోనే ధరలను పెంచక తప్పలేదని మదర్ డైరీ ఎండీ ఎస్ నాగరాజన్ పీటీఐకి తెలిపారు. అయితే, హాఫ్ లీటర్ ప్యాకెట్ పై రూ. 1 మాత్రమే పెంచుతున్నామని, 90 శాతం అమ్మకాలు ఈ విభాగంలోనే సాగుతుంటాయి కాబట్టి, ప్రజలపై పెద్దగా భారం పడదని ఆయన అన్నారు.
మారిన ధరల ప్రకారం, అర లీటరు ఫుల్ క్రీమ్ పాల ధర రూ. 25 నుంచి 26కు, లీటరు ధర రూ. 49 నుంచి రూ. 52కు పెరగనుంది. టోన్డ్ పాల ధర రూ. 39 నుంచి రూ. 42కు, డబుల్ టోన్డ్ పాల ధర రూ. 35 నుంచి 38కి చేరింది. ఆవు పాల ధర రూ. 40 నుంచి రూ. 42కు పెరిగింది. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, యూపీ ప్రాంతాల్లో పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని నాగరాజన్ తెలిపారు.