: నన్ను ఎన్నుకున్నవారే ఇప్పుడు కాదనడం విడ్డూరం?.. ఈసీకి వివరణలో శశికళ
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకున్న వారే ఇప్పుడు తన ఎన్నిక చెల్లదంటూ ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఈసీకి ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. ఐదేళ్లపాటు పార్టీ సభ్యత్వం లేని శశికళ ప్రధాన కార్యదర్శి పదవికి అనర్హులంటూ మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ శశికళను ఆదేశించింది. శుక్రవారం ఆమె ఎన్నికల కమిషన్‌కు వివరణ పంపారు. పార్టీ సర్వసభ్యమండలి సభ్యులంతా కలిసి తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారని, ఇందులో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శిగా తన ఎన్నిక సబబేనని, ఎక్కడా పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. తనను పార్టీ పదవికి ప్రతిపాదించిన వారే ఇప్పుడు తన ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని శశికళ ఈసీకి ఇచ్చిన వివరణలో ఆవేదన వ్యక్తం చేశారు.