: ఎన్టీఆర్ వల్లే మనం ఈ స్థాయికి.. మోత్కుపల్లితో కేసీఆర్
టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన ఏకైక కుమార్తె డాక్టర్ నీహారిక వివాహానికి ఆహ్వానించారు. ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్ల తెలంగాణలో ఎంతోమంది రాజకీయంగా ఎదిగారని, మనం కూడా ఈ స్థాయికి రావడానికి ఆయనే కారణమన్న మోత్కుపల్లి వ్యాఖ్యలకు కేసీఆర్ ఔనన్నారు. ఎన్టీఆర్ గొప్ప నేత అని, ఇది కాదనలేని సత్యమని కేసీఆర్ బదులిచ్చారు. రాష్ట్రంలో రిక్షా కార్మికులకు రెండు జతల బట్టలు ఇవ్వాలని మనం ఎన్టీఆర్‌ను కలిసి అడిగినప్పుడు ఆయన వెంటనే అంగీకరించిన విషయాన్ని మోత్కుపల్లి గుర్తు చేయగా.. కేసీఆర్ వెంటనే కల్పించుకుని ‘‘నర్సన్నా.. నీకు అన్నీ బాగానే గుర్తున్నాయ్’’ అన్నారు.
ఈ సందర్భంగా వారి మధ్య చంద్రబాబునాయుడు ప్రస్తావన కూడా వచ్చింది. ఉద్యమ సమయంలో పరస్పరం విమర్శలు చేసుకున్నా తనకు చంద్రబాబు అంటే వ్యతిరేకత ఏమీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే గవర్నర్ పదవి గురించి కేసీఆర్ ఆరా తీసినప్పుడు ‘అంతా భగవంతుడి దయ’ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని మోత్కుపల్లి అన్నారు. కాగా డాక్టర్ నీహారిక వివాహం ఈనెల 15న హైదరాబాద్‌లో జరగనుంది.