: నటుడు శివ బాలాజీని దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు
కాటమరాయుడు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తమ్ముడి పాత్రలో నటిస్తున్న నటుడు శివ బాలాజీపై ఓ వ్యక్తి దుర్భాషలాడాడు. సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ వేదికగా ఈ సంఘటన జరిగింది. కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన నాలుగు ఫొటోలను శివబాలాజీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ, ఒక వ్యక్తి మాత్రం శివబాలాజీపై దుర్భాషలాడాడు.
దీంతో, కంగుతిన్న శివబాలాజీ, ఆ ఫొటో సహా కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి, ‘ఎందుకు? నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. అసభ్యపదాలు వాడిన నీ మీద నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు తెలుసా?' అని పేర్కొంటూ ఓ లింక్ ను శివబాలాజీ పోస్ట్ చేశాడు. ఈ కామెంట్స్ ఆధారంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం ఆఫీసులో శివ బాలాజీ ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.