: భారత్-పాక్ మధ్య అణు యుద్ధం వచ్చే అవకాశం వుంది!: అమెరికా సెంట్రల్ కమాండ్
భారతదేశం-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అణుదాడులకు దారి తీయవచ్చునని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ జోసఫ్ వోటెల్ అభిప్రాయపడ్డారు. అమెరికా సెనేట్ ఆర్మ్ డ్ సర్వీసెస్ కమిటీకి భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అందులో పలు అంశాలు ప్రస్తావించారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేయడంతో భారతదేశం ప్రతిస్పందించే అవకాశం పెరుగుతుందని అన్నారు. దీంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఉంటూ భారత్ పై గురిపెట్టిన ఉగ్రవాదులపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పట్ల భారత్ ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు.
గతంలో భారత్ లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులపై స్పందించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ఇలాంటి దాడులు, ప్రతిస్పందనల వల్ల ఇరు దేశాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దౌత్యపరంగా పాకిస్థాన్ ను ఒంటరిని చేసేందుకు భారతదేశం అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న ప్రయత్నాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ రెండు దేశాలు అణ్వాయుధ దేశాలు కావడంతో ఈ దాడులు అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.