: బ్యాంకులు సహకరిస్తే సెటిల్ మెంట్ కు సిద్ధం: విజయ్ మాల్యా


ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా బ్యాంకులతో సెటిల్ మెంటుకు సిద్ధంగా ఉన్నానని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై  తాజాగా తీవ్రంగా స్పందించడంతో రుణాలు చెల్లించే అంశంపై సమస్యను ఒకేసారి పరిష్కరించేందుకు (వన్ టైం సెటిల్ మెంట్) బ్యాంకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా వున్నట్లు  మాల్యా చెప్పారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ పాలసీలు ఉన్నాయి... వందల మంది దీన్ని ఉపయోగించుకున్నారు. మాకు మాత్రం ఎందుకు దీన్ని నిరాకరిస్తున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయమై తాము సుప్రీంకోర్టు ముందు తమ ఆఫర్‌ ఉంచినప్పుడు బ్యాంకులు ఏమాత్రం పట్టించుకోకుండా తిరస్కరించాయని మాల్యా తెలిపారు. పారదర్శకంగా బ్యాంకులతో సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్వీట్‌లో పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని, సెటిల్‌మెంట్‌ చేసుకునే విధంగా బ్యాంకులను ఆదేశించాలని, అందుకు తాను సిద్ధంగా వున్నానని మాల్యా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోర్టు ప్రతి ఆదేశాన్ని తాను గౌరవిస్తానని... పారదర్శక విచారణ చేపట్టకుండానే ప్రభుత్వం తనను దోషిగా చూపిస్తోందని ఆరోపించారు.

కాగా, ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు అందజేసిన ఆస్తుల వివరాలు నిజమైనవేనా? అని మాల్యా తరఫు న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆస్తుల గురించి సరైన వివరాలనే అందించారా? అంటూ జస్టిస్‌ ఆదర్స్‌ కుమార్‌ గోయెల్, యూకే లలిత్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మాల్యాను ప్రశ్నించింది. అటు బ్యాంకులపైనా కీలక ప్రశ్నల్ని సంధించిన సుప్రీం తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News