: కోహ్లీ, కుంబ్లేలపై విరుచుకుపడ్డ ఆస్ట్రేలియా వార్తాపత్రికలు


భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య బెంగ‌ళూరులో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో రివ్యూ విషయంలో సాయం కోసం ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూడ‌డం ప‌ట్ల విరాట్ కోహ్లీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ విష‌యంలో అన్ని ఆధారాలున్నాయని ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ.. క్రీడాస్ఫూర్తికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. అయితే, ఆస్ట్రేలియా వార్తా ప‌త్రిక‌లు మాత్రం తమ ఆటగాళ్ల తప్పు లేదని క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నాయి. అంతేగాక‌, టీమిండియా ఆటగాళ్లే ఆ వివాదాన్ని సృష్టించార‌ని అంటున్నాయి. టీమిండియాకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మొద‌లుపెట్టాయి.

విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా చీఫ్ కోచ్‌ అనిల్‌ కుంబ్లే అసభ్యకరంగా ప్రవర్తించార‌ని ‘ది డెయిలీ టెలిగ్రాఫ్‌’ మీడియా కథనాలు ప్రచురించింది. విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెబుతూ... కోహ్లీ ఎనర్జీ డ్రింక్ బాటిల్‌ను విసరడంతో అది త‌మ దేశ‌ జట్టు ప్రతినిధికి తాకినట్లు అందులో పేర్కొంది. అంతేగాక‌, మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీని అంపైర్‌ ఔట్‌గా ప్రకటించిన స‌మ‌యంలో ఆ ఔట్‌కు గల స్పష్టమైన ఆధారాల కోసం అనిల్ కుంబ్లే అంపైర్ల గదికి వెళ్లార‌ని పేర్కొంది. త‌మ ఆట‌గాడు హ్యాండ్స్‌కాంబ్‌తో కూడా కోహ్లీ దురుసుగా ప్రవర్తించాడని క‌థ‌నాలు ప్ర‌చురించింది.

  • Loading...

More Telugu News