: 2004లో ఇళ్లను సైతం అమ్ముకునే స్థితిలో జగన్ కు.. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి?: సోమిరెడ్డి

టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆస్తులపై విమర్శలు చేసే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... లోటస్‌పాండ్ ఇంటిని ఎన్నికల అఫిడవిట్లో చూపించలేని జగన్.. లోకేశ్ ఆస్తులపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జగన్‌కు దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 2004లో ఇళ్లను సైతం అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్‌కు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. నిజాయతిగా వ్యాపారం చేసుకుంటోన్న లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలపై జగన్ కనీస పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన చెప్పారు.