: ఎగ్జిట్ పోల్స్ తప్పయితే మాత్రం... ఇన్వెస్టర్లకు పెను నష్టమే!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానుండగా, నాలుగు చోట్ల బీజేపీకి తిరుగులేదని చెబుతున్న ముందస్తు ఫలితాల సరళి, రేపు వాస్తవ గణాంకాలను ప్రతిబింబించ లేకుంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనుకున్నట్టుగా బీజేపీ మంచి ఫలితాలను రాబట్టలేకుంటే, ఇన్వెస్టర్లు, ప్రజలలో ఆ పార్టీపై అభిప్రాయాలు మారవచ్చని, ముఖ్యంగా నోట్ల రద్దు తరువాత, బీజేపీపై ప్రజలు కోపంగా ఉన్నారని స్పష్టమవుతుందని అంటున్నారు. అదే జరిగితే, నేడు స్వల్ప లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు, తదుపరి వారంలో భారీగా పతనమవుతాయని భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఒకటి రెండు సంస్థలు అంచనా వేసినట్టుగా, యూపీలో బీజేపీ మెజారిటీని సాధిస్తే, రెట్టించిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్ దూసుకు వెళ్లవచ్చని, మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, భారత మార్కెట్ కు యూపీ ఫలితాలు కీలకమని కోటక్ మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా అభిప్రాయపడ్డారు. ముందస్తు అంచనాలకు వాస్తవ ఫలితాలు ఉంటే, నిఫ్టీ సూచిక 200 పాయింట్ల వరకూ పెరగవచ్చని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నూతన కొనుగోళ్లకు ప్రయత్నిస్తారని అంచనా వేశారు.
కాగా, యూపీలోని 403 అసెంబ్లీ సీట్లలో 285 చోట్ల బీజేపీ గెలుస్తుందని చాణక్య సర్వే వెల్లడించగా, ఇండియా టుడే - యాక్సిస్ పోల్స్ సర్వేలో 251 నుంచి 279 సీట్లు వస్తాయని పేర్కొంది. సీ-ఓటర్ సంస్థ 161 సీట్లు, టైమ్స్ నౌ - వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ లో 190 నుంచి 210 సీట్లు రావచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మంచి ర్యాలీని కళ్లజూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ మోతీలాల్ వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీ మరింత కాలం పాటు కొనసాగుతుందని, యూపీ విజయంతో మరిన్ని సంస్కరణల అమలు దిశగా మోదీ అడుగులు వేయవచ్చని ఆయన అన్నారు.