: గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలితే చర్యలు తీసుకుంటామని బీఏసీ భేటీలోనే చెప్పాం: హరీశ్ రావు
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలితే చర్యలు తీసుకుంటామని బీఏసీ సమావేశంలోనే చెప్పామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేయడం పట్ల ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ.. శాసనసభలో ఇలాంటివి చేస్తోంటే తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఈ రోజు ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాలని అన్నారు.
ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధమని అన్నారు. ప్రసంగం జరుగుతుండగానే విమర్శలు గుప్పించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలు చెప్పాలనుకున్న ఏ అంశం అయినా శాసనసభలో చెప్పే అవకాశం ఉందని అన్నారు. అయినా కూడా ఎందుకీ తొందరపాటని ప్రశ్నించారు. శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎందుకిలా చేస్తున్నారని మండిపడ్డారు.