: అఖిలేష్ సంకీర్ణానికి 'నో' అంటున్న మాయావతి... కలిసేది లేదని స్పష్టీకరణ!
ఉత్తరప్రదేశ్ లో ఏ రాజకీయా పార్టీకి, కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాబోదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వేళ, మతతత్వ పార్టీని అధికారంలోకి రానీయకుండా చూసేందుకు సెక్యులర్ పార్టీలు చేతులు కలపాలని వ్యాఖ్యానించి, బహుజన్ సమాజ్ పార్టీతో కూటమి ఏర్పాటుకు సంకేతాలు ఇచ్చిన అఖిలేష్ వ్యాఖ్యలపై మాయావతి స్పందించారు. తానే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నానని, గెలిచేది తమ పార్టీయేనని వ్యాఖ్యానించిన ఆమె, తాము ఏ పార్టీతో చేతులు కలిపి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నట్టుగా హంగ్ ఏర్పాటయ్యే అవకాశాలు లేవని అన్నారు. కాగా, రేపు వెల్లడి కానున్న యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాక, బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయలేక, సమాజ్ వాదీ, బీఎస్పీ కలవకుంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.