: మణప్పురం, ముత్తూట్ లపై పెను ప్రభావం... బంగారంపై గరిష్ఠ రుణం రూ. 20 వేలే: ఆర్బీఐ కీలక నిర్ణయం
ఒకవైపు బ్యాంకు లావాదేవీలపై రుసుములు, మరోవైపు నగదుపై ఆంక్షలు, ఖాళీగా కనిపిస్తున్న ఏటీఎంలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, నగదు లావాదేవీలను గణనీయంగా తగ్గించాలని కంకణం కట్టుకున్న ఆర్బీఐ బంగారం రుణాలపై కఠిన ఆంక్షలు పెట్టింది. ఇందులో భాగంగా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రూ. 20 వేలకు మించి నగదు ఇవ్వరాదని ఆదేశించింది. ప్రస్తుతం ఆభరణాల తాకట్టు వ్యాపారంలోని పలు సంస్థలు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రూ. లక్ష వరకూ నగదును, ఆపై చెక్కులను ఇస్తున్న సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలను నియంత్రించే మార్గాల అన్వేషణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నిర్ణయంతో అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకునే వారికి కొత్త కష్టాలు ఎదురుకానున్నాయి. ఇదే సమయంలో బంగారం తాకట్టు వ్యాపారంలో వున్న మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ తదితర సంస్థలతో పాటు, నగరాలు, పట్టణాల్లోని చిన్నపాటి కుదువ వ్యాపారులపైనా పెను ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.