: అవసరమైతే బీఎస్పీతో కలిసి పని చేస్తాం: అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అయిన అనంతరం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు లక్నోలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల అనంతరం అవసరం అయితే తాము బీఎస్పీతో కలిసి పని చేస్తామని తెలిపారు. బీజేపీని అధికారంలోకి రాకుండా చూడడమే తమ లక్ష్యమని చెప్పిన ఆయన, అందుకోసం రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అయిన బీఎస్పీతో పొత్తుకు కూడా సిద్ధమని ప్రకటించారు. యూపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో నెగ్గి బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవనుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఆయన చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు బీజేపీ, సమాజ్ వాదీ-కాంగ్రెస్ పార్టీలు ఆశగా బీఎస్పీ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ రాజకీయ ఎత్తుగడల్లో బీఎస్పీ ఏం చేయనుందా? మాయావతి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల తరువాత అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా బీఎస్పీ నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడంతా మాయావతి నిర్ణయం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.