: జగన్ గారూ! మీలా నేను క్విడ్ ప్రోకో చెయ్యలేదు.. ఒక పద్ధతిలో వ్యాపారం చేసుకుంటున్నాం!: నారా లోకేష్
వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తన ఆస్తులు 23 రెట్లు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. దేశ రాజకీయాల్లో ఆరు సంవత్సరాలుగా ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక కుటుంబం తమదేనని అన్నారు. తమ కుటుంబం ఒక పధ్ధతి ప్రకారం వ్యాపారం చేస్తూ ఆస్తులు పెంచుకుంటోందని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేతలా తనపై కేసులు లేవని అన్నారు. ఆయనలా తాను క్విడ్ ప్రోకో చేయలేదని అన్నారు. తన కారణంగా ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లలేదని ఆయన ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థలో తమ కుటుంబానికి 23 లక్షల షేర్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఇలా పెరగడానికి తమకు 20 ఏళ్లు పట్టిందని అన్నారు. అప్పట్లో 190 రూపాయలున్న హెరిటేజ్ షేర్ ఇప్పుడు 1000 రూపాయలు అయిందని లోకేష్ తెలిపారు. అదే జగన్ ఆస్తులు కేవలం 12 నెలల్లోనే విపరీతంగా పెరిగిపోయాయని ఆయన అన్నారు. సాక్షి పేపర్ ను, సాక్షి టీవీని చూడవద్దని ఆయన సూచించారు. ఆ రెండింటిలో పూర్తి అవాస్తవాలు వెలువడుతున్నాయని ఆయన తెలిపారు. తాము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామని, అందుకే పాలు, పళ్లు అమ్ముకుంటున్నామని ఆయన అన్నారు. నీతీనిజాయతీగా సంపాదించడం తన తండ్రి నేర్పించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు జగన్ ఆస్తులు ప్రకటించలేదని, ఆయన ఆస్తులు ప్రకటించాలని తాను శాసనమండలిలో ఆ అంశాన్ని లేవనెత్తుతానని లోకేష్ తెలిపారు.