: తమిళనాట మళ్లీ ఎన్నికల కోలాహలం... ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక
తమిళనాట మరోసారి ఎన్నికల కోలాహలం మొదలు కానుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించింది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ పేర్కొంది. ఈ నెల 23 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, వచ్చే నెల 15న నిర్వహిస్తామని వెల్లడించింది.
కాగా, ఆర్కే నగర్ ఎన్నిక జరిగితే, తాను పోటీకి దిగుతానని ఇప్పటికే జయలలిత మేనకోడలు దీపా రాజకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతుందని నిరూపించేందుకు ఈ ఎన్నికలను ఓ అస్త్రంగా వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమయ్యాయి. దీప బరిలోకి దిగిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం ఆమెకు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు డీఎంకే సైతం ఈ స్థానానికి గట్టి పోటీని ఇస్తుందని అంచనా.