: పవిత్ర సంగమ ఘాట్ టూ అమరావతి... 'కూచిపూడి' స్టయిల్ లో కొత్త బ్రిడ్జి!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి దారితీసే మార్గాన్ని మరింతగా తగ్గించేందుకు కృష్ణా నదిపై సరికొత్త వంతెనను నిర్మించేందుకు చంద్రబాబు ఆసక్తిని చూపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలోని పవిత్ర సంగమ ఘాట్ నుంచి నది మీదుగా, అమరావతి వైపు సరికొత్త వంతెనను నిర్మించేందుకు ఆయన ఓకే చెప్పారు. ఈ ఉదయం సీఆర్డీయే అధికారులతో అమరావతి నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వం చేపట్టే ఏ నిర్మాణమైనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండాలని సలహా ఇచ్చారు. కొత్త బ్రిడ్జి కూచిపూడి ముద్రను తలపించేలా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఓ డిజైన్ పై బాబు సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక అమరావతికి దారితీసే ఏడు రహదారులకు సంబంధించిన టెండరు ప్రక్రియ పూర్తయిందని, నిర్మాణ సంస్థలు త్వరలోనే పనులు ప్రారంభిస్తాయని ఈ సమీక్షలో అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి చంద్రబాబుకు తెలియజేశారు.