: హైదరాబాదీ బిర్యానీ.. ఆ హోదాను అందుకోలేకపోయింది!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాదీ బిర్యానీ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశస్తులైనా, విదేశీయులైనా హైదరాబాదుకు వస్తే... దీని రుచిని ఆస్వాదించాల్సిందే. సినీ తారలు కావచ్చు, స్పోర్ట్స్ స్టార్లు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు ఎవరైనా సరే ఇక్కడకు వస్తే హైదరాబాదీ బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటారు. ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగిన హైదరాబాదీ బిర్యానీ కీలకమైన విషయంలో మాత్రం ఫెయిల్ అయింది.
జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ సంపాదించుకోవడంలో మన హైదరాబాదీ బిర్యానీ విఫలమైంది. ఈ ట్యాగ్ కోసం హైదరాబాదులో ఉన్న 'అసోసియేషన్ ఆఫ్ బిర్యానీ మేకర్స్' వాళ్లు 2009 ఏప్రిల్ లో దరఖాస్తు చేశారు. దీంతో, తమ నిబంధనల మేరకు హైదరాబాదీ బిర్యానీకి ఉన్న చారిత్రక ఆధారాలు, పత్రాలు సమర్పించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. అయితే, ఆధారాలు చూపడంలో మన వాళ్లు విఫలం కావడంతో... జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ను హైదరాబాదీ బిర్యానీ పొందలేకపోయింది. ఏదైనా ఒక ఉత్పత్తి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది అనుకుంటే... దానికి జీఐ ట్యాగ్ ఇస్తారు. అప్పుడు ఆ పేరును ఇతరులు వాడుకోవడానికి వీలుండదు.