: అవును.. ఖాతాల్లో కనీస నిల్వలు లేకుంటే పెనాల్టీ విధిస్తాం!: స్పష్టం చేసిన అరుంధతీ భట్టాచార్య
ఖాతాల్లో కనీస నిల్వలు లేకుంటే ఎటువంటి మొహమాటం లేకుండా పెనాల్టీ చార్జీలు విధిస్తామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు. జన్‌ధన్ ఖాతాలకు మాత్రం ఇది వర్తించదని ఆమె పేర్కొన్నారు. ఈ ఖాతాల నిర్వహణ భారంగా మారడంతోనే కనీస నిల్వ ఆంక్షలు విధించామని, కనీస నిల్వ లేకుంటే జరిమానా చెల్లించక తప్పదన్నారు. మొత్తం 11 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ఉన్నట్టు ఆమె తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి జరిమానా విధించే పాత పద్ధతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు ఎస్‌బీఐ ప్రయత్నిస్తుండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అరుంధతి ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై మరోసారి ఆలోచించాలంటూ చేసిన ప్రభుత్వ సూచనపై తమకు సమాచారం లేదని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజనీశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం కోరితే కనుక పునరాలోచిస్తామని ఆయన పేర్కొన్నారు.