: మా ఇంట్లో బాధ మాటల్లో వర్ణించలేను: సీఎం అఖిలేష్


ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ నిన్నటి వరకు తీరిక లేకుండా గడిపారు. లక్నోలోని కాళిదాస్ మార్గ్ లోని తన అధికారిక నివాసంలో ప్రస్తుతం ఆయన సేద తీరుతున్నారు. భార్య డింపుల్ యాదవ్ తో కలిసి తన నివాసంలో ఉన్న ఆయన్ని, మీడియా కలవగా వారితో సరదాగా మాట్లాడారు. యూపీలో అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేశారని అన్నారు. ముఖ్యంగా, వారణాసి కోసం ప్రత్యేకంగా ప్రధాని మోదీ, బీజేపీ కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించారని అన్నారు. వారణాసి నియోజకవర్గం ఎస్పీ చేతుల్లోకి వచ్చేస్తుందని బీజేపీ భయ పడిందని, అందుకే, అగ్ర నేతలతో ప్రచారం నిర్వహించిందని అఖిలేష్ చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో మొదటి వారం రోజులు బాగా కష్టంగా అనిపించిందని, ఆ తర్వాత బాగానే ఉందని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. అయితే, సమాజ్ వాదీ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వారి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని డింపుల్ ను మీడియా ప్రశ్నించింది. వెంటనే, అఖిలేష్ జోక్యం చేసుకుంటూ.. తమ ఇంట్లో పరిస్థితి ఎంత బాధాకరమైందో మాటల్లో చెప్పలేనని అన్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ పరమహంస, ఆయన శిష్యుడు వివేకానందుడు మధ్య ఓ సందర్భంలో జరిగిన సంభాషణను అఖిలేష్ ప్రస్తావించారు. ‘దేవుడిని చూపించమని రామకృష్ణ పరమహంసను వివేకానందుడు అడిగాడట. అప్పుడు.. వివేకానందుడిని రామకృష్ణ పరమహంస గట్టిగా గిల్లారట. ‘ఏమైంది?’ అని రామకృష్ణ పరమహంస ప్రశ్నించగా..‘నొప్పిగా ఉంది’ అని వివేకానందుడు బదులు ఇచ్చారట. ‘ఏదీ ఆ నొప్పిని చూపించు’ అని రామకృష్ణ పరమహంస ప్రశ్నించడంతో వివేకానందుడు ఆశ్చర్యపోయారు’ అని చెప్పిన అఖిలేష్, తమ ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉందని విలేకరులతో చెప్పారట.

  • Loading...

More Telugu News