: మహిళా దినోత్సవం రోజున తల్లికి న్యాయం చేసిన న్యాయస్థానం!
మహిళా దినోత్సవం రోజున వృద్ధురాలైన మహిళకు గోవింద్ పురా ప్రాంత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ముకుల్ గుప్తా న్యాయం చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... భోపాల్ కు చెందిన గ్యారసి సాహు (87)కు ఇద్దరు పిల్లలు, భర్తను కోల్పోయిన ఆమెను ప్రభుత్వోద్యోగులైన ఆమె కుమారులు రాజేశ్ సాహు (50), నర్మదా సాహు (55) పట్టించుకోవడం మానేశారు. దీంతో ఒంటరిగా అనాథలా మారిన గ్యారసి సాహు తన కుమారులు తన బాగోగులు చూసుకునేలా ఆదేశించమని కోరుతూ ఎస్‌డీఎంకి దరఖాస్తు చేసుకున్నారు. 2007లో ప్రభుత్వం చేసిన వయోజనుల సంక్షేమ చట్టం అమలుకు సంబంధించిన పూర్తి బాధ్యత ఎస్డీఎందే కావడంతో పిటిషన్ ను విచారించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ముకుల్ గుప్తా ఆమె కుమారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తల్లిని చూసుకోకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి నెలా రాజేశ్ సాహు 8,000 రూపాయలు, నర్మదా సాహు 4,000 రూపాయలు ఆమెకు ఇవ్వాలని ఆదేశించారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజెన్స్ చట్టం (ఎండబ్ల్యూపీఎస్సీఏ) 2007 ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని వారి పిల్లలకు సెక్షన్ 24 కింద మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీంతో తల్లిని జాగ్రత్తగా చూసుకుంటామని వారు హామీ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లారు.