: జయలలిత మరణంపై ప్రభుత్వం ఇచ్చిన నివేదిక తప్పుల తడక... కోర్టును ఆశ్రయిస్తా: పన్నీరు సెల్వం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తప్పుల తడకగా ఉందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆరోపించారు. మద్రాసులో జయలలిత మృతిపై చేపట్టిన నిరాహార దీక్ష ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయలలిత మృతిపై మద్రాసు హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. అపోలో ఆసుపత్రి విడుదల చేసిన నివేదికకు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికకు పొంతనలేదని ఆయన చెప్పారు. తామెంతగానో ప్రేమించే జయలలిత మృతి వెనుక వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.
తమ అనుమానాలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమె మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. వారసత్వ రాజకీయాలను జయలలిత ఏనాడూ ప్రోత్సహించలేదని ఆయన చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ ఒక కుటుంబం చేతిలో బందీ కాకుండా ఉండేందుకు తాము పోరాడుతున్నామని ఆయన తెలిపారు. ఈ పోరాటంలో ఎంత దూరమైనా వెళ్తామని ఆయన చెప్పారు. కాగా, తమిళనాడు వ్యాప్తంగా జయలలిత మృతిపై పన్నీరు సెల్వం మద్దతుదారులు నిరాహారదీక్షకు దిగిన సంగతి తెలిసిందే.