: ప్రాక్టీస్ లో లేనివారి గుర్తింపు రద్దు.. త్రిపుర బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం !


గత ఐదేళ్లు లేదా అంత కంటే ఎక్కువ కాలం పాటు న్యాయవాద వృత్తికి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు చేపట్టని న్యాయవాదుల గుర్తింపు రద్దు చేస్తూ త్రిపుర బార్ కౌన్సిల్ (టీబీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్రిపుర బార్ కౌన్సిల్ చైర్మన్ పియూష్ కాంతి బిశ్వాస్ ఒక ప్రకటన చేశారు. న్యాయవాద వృత్తిలో కొనసాగని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని 2010లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ ఉత్తర్వుల ఆధారంగానే తాము ఈ నిర్ణయం తీసకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం డిబార్ అయిన 260 మంది పేర్లు త్రిపుర హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని వివిధ బార్ కౌన్సిళ్లలో నమోదై ఉన్నాయన్నారు. డిబార్ అయిన వారి  పేర్ల జాబితాను టీబీసీ కార్యాలయంలో ఉంచామన్నారు.

లా డిగ్రీ పొందిన చాలా మంది ప్రాక్టీస్ నిమిత్తం ఆయా బార్ కౌన్సిళ్ళలో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, కానీ, వారిలో చాలా మంది ప్రాక్టీస్ చేపట్టలేదని చెప్పారు. గుర్తింపు రద్దయిన న్యాయవాదుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపారు. వారిలో త్రిపుర అసెంబ్లీ స్పీకర్ రామేంద్ర చందర దేబ్ నాథ్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రామ్ బర్మన్, సమీర్ రంజన్ బర్మన్, త్రిపుర బీజేపీ ఉపాధ్యక్షుడు సుబాల్ భౌమిక్ తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు. త్రిపుర బార్ కౌన్సిల్ సభ్యుల్లో న్యాయవాద వృత్తి చేపట్టని వారు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తమ పేర్లను నమోదు చేసుకున్నవారు, నేరచరితులు కూడా ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని పియూష్ కాంతి బిశ్వాస్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News