: క్రికెట్ దిగ్గజం ఇయాన్ హీలేకి కౌంటర్ ఇచ్చిన కోహ్లీ
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలేకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీపై తనకు ఎంతో అభిమానం ఉందని... కానీ, గ్రౌండ్ లో అతను వ్యవహరిస్తున్న తీరు, అతనిపై గౌరవం తగ్గించేలా ఉందని హీలే అన్నాడు. స్మిత్ తో కోహ్లీ వివాదం నేపథ్యంలో హేలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రవర్తనతో భారత జట్టుపై కూడా ఒత్తిడి పడుతోందని చెప్పాడు. స్మిత్ పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరు అంగీకరించలేనిదంటూ అన్నాడు.
దీనిపై కోహ్లీ మాట్లాడుతూ, తమ దేశంలో 120 కోట్ల జనాభా ఉందని, ఒక్క వ్యక్తి మాత్రమే ఏమీ చేయలేడని హీలేని ఉద్దేశించి చెప్పాడు. "సెంచూరియన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ను గుర్తుకు తెచ్చుకో. యూ ట్యూబ్ లో వెతికితే వీడియో కనపడుతుంది. డౌన్ ది లెగ్ బంతికి ఔట్ అయిన సందర్భంలో ఏం చేశావో చూడు. అంపైర్లతో నా ప్రవర్తన గురించి అతనేదో అన్నాడని విన్నా. యూట్యూబ్ లో మీరంతా ఆ వీడియో చూడండి" అని కోహ్లీ అన్నాడు. బెంగళూరులో మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఎప్పుడో జరిగిన ఈ మ్యాచ్ లో తనను ఔట్ గా అంపైర్ ప్రకటించడం పట్ల ఇయాన్ హీలే అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు, డ్రెస్సింగ్ రూమ్ వద్ద తన బ్యాట్ ను విసిరేశాడు.