: ఎస్బీఐ మాత్రమే కాదు... కస్టమర్లను బాదుతున్న పీఎన్బీ, బీఓబీ, బీఓఐ
కస్టమర్లు తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ను ఉంచకుంటే భారీగా పెనాల్టీలు బాదాలన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులు సైతం ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ కొత్త బాదుడు ప్రారంభం కానుండగా, కనీస మొత్తాలను ఉంచకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500, ఇతర ప్రాంతాల్లో రూ. 1000 జరిమానాను పంజాబ్ నేషనల్ బ్యాంకు విధిస్తోంది. బ్యాంకు వెబ్ సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం, శాఖ ఉన్న ప్రాంతాన్ని, ఖాతాలో నమోదవుతున్న లోటు ఆధారంగా జరిమానాలో మార్పు, చేర్పులు ఉండనున్నాయి.
ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు గ్రామీణ ప్రాంత ఖాతాల్లో ఓ త్రైమాసికానికి రూ. 500 కనీస మొత్తం లేకుంటే, రూ. 100, పట్టణ ప్రాంతాల్లో రూ. 1000 లేకుంటే, రూ. 200 వరకూ జరిమానా విధిస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల క్రితం, అంటే 2012లో ఖాతాదారులను పెంచుకునే లక్ష్యంతో, కనీస బ్యాలెన్స్ నిర్వహించకున్నా జరిమానాలు విధించబోమని నిర్ణయం తీసుకున్న ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులు, ఇప్పుడు కస్టమర్ల సంఖ్య పెరిగిన తరువాత తిరిగి చార్జీలను విధిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.