: మహిళలు అన్నింటిలోనూ రాణిస్తున్నారు.. ఆర్టీసీ డ్రైవర్లుగా మాత్రమే సక్సెస్ కాలేదు: చంద్రబాబు
ఆడపిల్లలకు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉద్యోగాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో నిర్వహిస్తోన్న మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. మగపిల్లల కంటే ఆడపిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తే అదో శుభపరిణామమని అన్నారు. వారందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఎదురుకట్నాలు ఇచ్చే రోజులు వస్తాయని అన్నారు.
ఆడవారు అన్నిరంగాల్లోనూ ధైర్యంగా అడుగులు వేయాలని చెప్పారు. ఈ రోజు ఆర్టీసీలో 33 శాతం మంది కండక్టర్లు ఆడవారేనని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్లుగా, కండక్టర్లుగా, ఎస్సైలుగా, పోలీస్ కానిస్టేబుళ్లుగా ఆడవారు పనిచేయాలని తాము కృషి చేశామని అన్నారు. ఆడవారు ఆర్టీసీ డ్రైవర్లుగా మాత్రమే సక్సెస్ కాలేదని అన్నారు. డ్రైవర్లుగా కూడా పనిచేస్తే మరింత ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్పారు. స్త్రీ పురుష సమానత్వానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆస్తిలో పురుషులతో సమానంగా మహిళలకు హక్కు కల్పించింది ఎన్టీఆరేనని ఆయన అన్నారు.