: బరువు తక్కువ - బలమెక్కువ... సరికొత్త 'స్విఫ్ట్' వస్తోంది
ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న సుజుకి సంస్థ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ కారును జెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. వచ్చే నెలలో యూరప్ లో, ఆపై 2018లో ఇండియాలో విడుదల కానున్న ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సంస్థ తెలిపింది. మరింత బలమైన ప్లాట్ ఫాంపై కారు బాడీ వుంటుందని, ప్రస్తుతమున్న స్విఫ్ట్ వేరియంట్లతో పోలిస్తే, తక్కువ బరువుంటుందని సుజుకి మోటార్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ కాంజీ సాయితో వెల్లడించారు.
సరికొత్త రక్షణాత్మక విధానాలు, హైబ్రిడ్ డ్రైవ్ అనుభూతిని ఈ కారు అందిస్తుందని తెలిపారు. వచ్చే సంవత్సరం ఆరంభంలో భారత రోడ్లపై కారును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని, ఆపై మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. మోనోక్యులర్ కెమెరా, లేజర్ సెన్సార్లు, ఎమర్జన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్టెన్స్ వంటి సౌకర్యాలతో పాటు, ఇప్పుడున్న స్విఫ్ట్ కన్నా 5 శాతం అధిక మైలేజీని ఇస్తుందని వివరించారు. ప్రస్తుతం స్విఫ్ట్ తాజా వేరియంట్ కారు బరువు 960 కిలోలు కాగా, ఈ కారు బరువు 840 కిలోలు మాత్రమే ఉంటుందని అన్నారు. కాగా, 2004లో తొలిసారిగా విడుదలైన స్విఫ్ట్ మోడల్ కార్లు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షలకు పైగా తిరుగుతున్నాయి.