: అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయిన పైలట్... క్షమాపణలు కోరిన ఇండిగో

అది చెన్నై నుంచి మధురైకి బయలుదేరాల్సిన ఇండిగో ఫ్లయిట్ 6ఈ-859. విమానం బయలుదేరే సమయం ఆసన్నమైంది. ప్రయాణికులంతా వచ్చేశారు. అయినా విమానం కదల్లేదు. సర్వీసులను కచ్చితమైన సమయానికి నడుపుతుందన్న మంచి పేరున్న ఇండిగో సంస్థ విమానం మాత్రం అరగంటైనా కదల్లేదు. మధురైలో విమానం దిగేందుకు ఇంకా అనుమతి లభించలేదని, అందువల్లే టేకాఫ్ తీసుకోవడం లేదని పైలట్ చెప్పిన మాట విని, ప్రయాణికులు తమ సీట్లలోనే కూర్చున్నారు.

అయితే, తాము విమానానికి క్లియరెన్స్ ఇచ్చినా కూడా, కదలకపోవడాన్ని గమనించిన చెన్నై ఏటీసీ అధికారి ఒకరు, పైలట్ ను కలిసేందుకు రాగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలో ఉండాల్సిన కో-పైలట్ రాకపోవడం వల్ల విమానాన్ని కదల్చకుండా, ల్యాండింగ్ కు అనుమతి రాలేదని అటు చెన్నై ఏటీసీని, ఇటు ప్రయాణికులను పైలట్ మభ్యపెట్టినట్టు వెల్లడైంది. దీనిపై చెన్నై ఏటీసీ ఫిర్యాదు మేరకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండిగోకు నోటీసులు ఇచ్చింది. ఆపై స్పందించిన ఇండిగో, జరిగిన ఘటనపై బేషరతు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ప్రయాణికులకు మెసేజ్ లను, ఈ-మెయిల్స్ ను పంపింది.

More Telugu News