: అసలక్కడ ఏం జరుగుతోంది?.. ఆ పెద్ద మనుషుల్ని ఎవరూ ప్రశ్నించకూడదా?: ఏపీ ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు
హంద్రీ-నీవా నదిలో ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అంక్షింతలు వేసింది. అసలక్కడ ఏం జరుగుతోందంటూ ప్రశ్నించింది. ‘ప్రజల భూముల్లో చట్టవ్యతిరేకంగా ట్రాక్‌లు నిర్మించారు. రేపు మీ వంతు, తర్వాత మా వంతు కావచ్చు. ఆ పెద్ద మనుషుల్ని ఎవరూ ప్రశ్నించకూడదా? సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
కర్నూలు జిల్లాలోని కిషన్‌గిరి, కందుకూరు మండలాల పరిధిలో హంద్రీ-నీవా నదిలోంచి ఇసుకను అక్రమంగా తరలించుకుపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయంటూ రైతులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది సమర్పించిన ఇసుక రవాణా ట్రాక్‌ల నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను కోర్టు పరిశీలించింది. దీని వెనక ఉన్న పెద్ద మనుషులపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించింది. ఇప్పటి వరకు 644 వాహనాలను పట్టుకున్నట్టు చెబుతున్నారని, ఎన్నింటిని సీజ్ చేశారని ప్రశ్నించింది. తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.