: జయ మృతిపై విడుదల చేసిన వైద్య నివేదికలకు ఒకదానికొకటి పొంతన లేదు: స్టాలిన్
తమిళనాడు సీఎం జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు గాను ఎయిమ్స్ వైద్య నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. జయలలిత మృతిపై ఎయిమ్స్ విడుదల చేసిన నివేదికకు, గతంలో అపోలో ఆసుపత్రి విడుదల చేసిన రిపోర్టుకు చాలా తేడా ఉందని ప్రతిపక్ష నేత స్టాలిన్, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రాందాస్ అన్నారు. ఈ విషయమై వారు పలు ప్రశ్నలు సంధించారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, గత సెప్టెంబర్ 25న అపోలో వైద్యులు విడుదల చేసిన జయలలిత హెల్త్ బులెటిన్ లో జ్వరం, పోషకాహార లోపంతో ఆమె ఆసుపత్రిలో చేరారని.. మరి కొన్ని రోజుల్లో ఆమె తిరిగి ఇంటికి చేరుకుంటారని పేర్కొన్నారన్నారు. అయితే, ఎయిమ్స్ వైద్యుల నివేదికను అనుసరించి, జయలలిత ఆసుపత్రిలో చేరే నాటికి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారని అన్నారు. అదే విధంగా, ‘ఎయిమ్స్’ తాజా నివేదికలో పొంతన లేని సమాధానాలు ఎన్నో ఉన్నాయన్నారు.
పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రాందాస్ మాట్లాడుతూ, ఎయిమ్స్ వైద్య నివేదిక ప్రకారం, అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన జయలలిత, ఉప ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై వేలిముద్ర ఎలా వేశారని ప్రశ్నించారు. జయలలితకు ఎలాంటి వైద్య చికిత్స అందించారో తనకు తెలియదని పన్నీర్ సెల్వం చెబుతుండగా, ఆయనకు అన్నీ తెలుసని ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి విడుదల చేసిన వైద్య నివేదిక చెబుతోందని, ఈ రెండింటిలో ఎవరు చెప్పింది వాస్తవమని ప్రశ్నించారు.