: ‘గుండె జారి గల్లంతయ్యిందే’ డైరెక్టర్ కు నిజ జీవితంలో 'ప్రేమపెళ్లి' కష్టాలు!


తెలుగులో రెండు ప్రేమ కథా చిత్రాలను అందించిన డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. నిజ జీవితంలో ఆయనకు  సినిమా కష్టాలు ఎదురయ్యాయి. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. హైదరాబాద్ లోని రాంనగర్ కు చెందిన ప్రసూన అనే యువతిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, తన కూతురికి మాయమాటలు చెప్పి అతను పెళ్లి చేసుకున్నాడని ప్రసూన తల్లి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ పై ఆమె చెప్పుతో దాడి చేసింది.

దీంతో, తమకు రక్షణ కల్పించాలంటూ విజయ్ కుమార్, ప్రసూన జంట పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ నెల 1న శ్రీనగర్ కాలనీలోని ఓ దేవాలయంలో విజయ్ కుమార్, ప్రసూనను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న ప్రసూన తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. తన కూతురుకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని విజయ్ కుమార్ మాయమాటలు చెప్పాడని, అయితే అతను గతంలోనే వివాహం చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ క్రమంలో ఎస్ఆర్ నగర్ పోలీసులు విజయకుమార్, ప్రసూనను పిలిపించి మాట్లాడారు. తాము ఇద్దరం మేజర్లమని, ఇష్ట ప్రకారమే తాను పెళ్లి చేసుకున్నానని ప్రసూన చెప్పినట్టు సమాచారం. వాళ్లిద్దరూ మేజర్లు కనుక కేసు పెట్టడం కుదరదని పోలీసులు చెప్పారు. దీంతో, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన విజయకుమార్ పై  ప్రసూన తల్లి చెప్పు విసిరేసింది. ఈ సంఘటనతో నిర్ఘాంతపోయిన విజయకుమార్ తనతో వచ్చిన వారితో కలిసి కారులో వెళ్లిపోయారు. అయితే, విజయ్ కుమార్ కు గతంలో పెళ్లి అయినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని చూపిస్తామని ప్రసూన తల్లిదండ్రులు అంటున్నారు. తన కూతురిని మోసం చేస్తాడని, అటువంటి సంఘటన జరగకముందే ఆమె తమ వద్దకు వస్తే సరిపోతుందని ప్రసూన తల్లిదండ్రులు అన్నారు.

  • Loading...

More Telugu News