: ఇకపై నేను, సుదీప్ నటులము మాత్రమే.. స్నేహితులం ఎంతమాత్రం కాదు!: కన్నడ నటుడు దర్శన్
కన్నడ హీరోలు సుదీప్, దర్శన్ మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. సినీ పరిశ్రమలో దర్శన్ కు అవకాశాలు రావడానికి తానే కారణమని సుదీప్ చేసిన ట్వీట్ వారి మధ్య చిచ్చు పెట్టింది. ఈ ట్వీట్ పై స్పందించిన దర్శన్, సుదీప్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని మరో ట్వీట్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, దర్శన్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి ఆ వ్యాఖ్యలను పోస్ట్ చేశారని ఇంతవరకూ అందరూ అనుకున్నారు.
కానీ, ఆ వ్యాఖ్యలు పోస్ట్ చేసింది తానేనని దర్శన్ స్పష్టం చేశారు. ఇంతకీ, దర్శన్ తన ట్వీట్ లో ఎలా ప్రతి స్పందించాడంటే...‘ఇకపై నేను, సుదీప్ స్నేహితులం కాదు. కేవలం, కన్నడ చిత్ర పరిశ్రమలోని నటులము మాత్రమే. ఊహాగానాలకు ఎటువంటి తావు లేదు. ఈ విషయం ఇక్కడితో ముగిసింది’ అని పేర్కొన్నాడు. కాగా, ఈ విషయమై సుదీప్ మాత్రం స్పందించాల్సి ఉంది. సుదీప్, దర్శన్ లు మంచి స్నేహితులు. వీరి స్నేహం చెడటంతో వారి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరు హీరోలు కేవలం ట్వీట్లు మాత్రమే చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం గమనార్హం.