: పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తే పది ఓట్ల తేడాతో గెలుస్తా: టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తాను పోటీ చేసి గెలుస్తానని .. జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పై తాను పోటీ చేస్తే కనుక కనీసం పది ఓట్ల తేడాతో అయినా గెలుస్తానని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు అంటే తనకు అసలు భయం లేదని.. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా పోటీ చేసేందుకు తాను సిద్ధమని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడిని ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబుకు వచ్చే ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని, అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని ఆయన కొనియాడారు. చంద్రబాబు ముందు ప్రధాని మోదీ కూడా సరిపోరని కితాబిచ్చిన జలీల్ ఖాన్, బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం తమకు లేదని, రాజకీయంగా అటువంటి పరిస్థితులు లేవని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు మంత్రి పదవి వస్తుందో రాదో తనకు తెలియదని, మంత్రి పదవి కంటే ఎమ్మెల్యే గా ఉండటమే మంచిదని జలీల్ ఖాన్ అభిప్రాయపడ్డారు.