: రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టి, రూ. 265 కోట్ల లాభంతో పేటీఎం నుంచి తప్పుకున్న అనిల్ అంబానీ!
డిజిటల్ చెల్లింపుల మాధ్యమ సంస్థగా సేవలందిస్తున్న పేటీఎంలోని తన వాటాలను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ విక్రయించింది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా నేతృత్వంలో నడుస్తున్న పేమెంట్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్ కు, పేటీఎంలో తన పేరిట ఉన్న ఒక శాతం వాటాను రూ. 275 కోట్లకు రిలయన్స్ కాపిటల్ విక్రయించినట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2010లో పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లో అనిల్ అంబానీ సంస్థ రూ. 10 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఆపై పేటీఎం వ్యాపారం పెరుగుతూ రాగా, గత సంవత్సరం నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించిన తరువాత పేటీఎం శరవేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. కాగా, ఇక డిజిటల్ చెల్లింపుల మాధ్యమ సంస్థగా పేటీఎం గరిష్ఠస్థాయికి చేరిందని భావించిన మీదటే, అనిల్ అంబానీ తప్పుకోవాలని నిర్ణయించుకుని, తమ వాటాలను విక్రయించినట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డీల్ పై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది.