: భారత వైద్యుల అద్భుతం... నెలలో 120 కిలోలు తగ్గిన ఈమన్ అహ్మద్
దాదాపు 500 కిలోల బరువుతో, ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరున్న ఈమన్ అహ్మద్, ముంబై వైద్యుల అద్భుత చికిత్సా విధానాల ఫలితంగా నెల రోజుల వ్యవధిలోనే 120 కిలోల బరువు తగ్గింది. ఈజిప్టుకు చెందిన ఈ మహిళ, స్థూలకాయ సమస్యలతో బాధపడుతూ, అత్యంత వ్యయ ప్రయాసలతో చికిత్స నిమిత్తం ముంబై సైఫీ ఆసుపత్రికి గత నెలలో వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బరువు 380 కిలోలని, తనంతట తానుగా లేచి కూర్చోగలుగుతోందని ఆమెకు చికిత్స చేస్తున్న బేరియాట్రిక్ విభాగం సర్జన్ డాక్టర్ ముఫజాల్ లక్డావాలా వెల్లడించారు.
ఈ నెలలో ఆమె 50 కిలోల వరకూ బరువు తగ్గుతుందని భావించగా, వైద్యులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, 100 కిలోలకు పైగా బరువు తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ద్రవ ఆహారం, రెగ్యులర్ గా ఫిజియో థెరపీని అందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఆమెకు బేరియాట్రిక్ సర్జరీని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆమెకు పలుమార్లు స్ట్రోక్స్ వస్తున్నాయని, మరింతగా బరువు తగ్గి, ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లో పట్టే స్థితికి చేరిన తరువాతనే దీనికి కారణాలు కనుగొనగలమని లక్డావాలా తెలిపారు. కాగా, ఆమెకు చికిత్స చేసేందుకు ఆసుపత్రి వైద్యులు క్రౌడ్ ఫండింగ్ విధానంలో రూ. 60 లక్షలు సేకరించిన సంగతి తెలిసిందే.