: హీరో విశాల్ పై మండిపడ్డ 'కబాలి' నిర్మాత
ఇప్పటికే తమిళ నటీనటుల సంఘమైన నడిగర్ సంఘంపై విజయబావుటా ఎగురవేసిన తెలుగు హీరో విశాల్... ఇప్పుడు నిర్మాతల సంఘం ఎన్నికలపై దృష్టి సారించాడు. నిర్మాతల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఉన్న నిర్మాతల సంఘంపై విశాల్ తీవ్ర విమర్శలు చేశాడు. నిర్మాతల సంఘం పట్టించుకోకపోవడం వల్లే సినీ నిర్మాతగా ఉన్న తన తండ్రి నిరుపేదగా బిచ్చమెత్తుకునే స్థాయికి చేరుకున్నారని విశాల్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. సినిమాలు తీయని వారు కూడా నిర్మాతల సంఘం పదవి కోసం పాకులాడటం న్యాయమేనా? అని ప్రశ్నించాడు. విశాల్ వ్యాఖ్యలతో నిర్మాతల సంఘం నేతలు మండిపడ్డారు. టీనగర్ లో ఉన్న నడిగర్ సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పలువురు సినీ నిర్మాతలు నడిగర్ సంఘం ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా 'కబాలి' చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను మాట్లాడుతూ, విశాల్ కు ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కోరిక కలిగినట్టుందని...అందుకే తన ఆశలను నెరవేర్చుకోవడానికి నడిగర్ సంఘాన్ని, నిర్మాతల సంఘాన్ని వాడుకోవాలని చూస్తున్నాడంటూ విమర్శించారు. 4000 మంది సభ్యులున్న నడిగర్ సంఘం మంచిచెడ్డలు వదిలేసి... 1500 మంది ఉన్న నిర్మాతల సంఘంపై విశాల్ కన్నేశాడని విమర్శించారు. విశాల్ ను హీరోగా పెట్టి కదకళి, పట్టత్తుయానై, అంబళే, సమర్, కత్తసండై సినిమాలను తీసిన నిర్మాతలు సర్వస్వం కోల్పోయారని... ముందు వారిని కాపాడాలని సూచించారు. విశాల్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు సైతం చాలా నష్టపోయారని ఆరోపించారు. విశాల్ పై నడిగర్ సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.