: తీవ్రంగా భావోద్వేగాలకు గురవుతున్నారా? అతిగా తింటున్నారా? అయితే, మీ గుండెకు చేటే!


తీవ్ర భావోద్వేగాలు, అతిగా తినటం, తీవ్ర శారీరకశ్రమ వంటి కార‌ణాల‌తో కూడా గుండెపోటు ముప్పు ఉంటుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. గుండెపోటుకి కేవ‌లం మధుమేహం, అధిక రక్తపోటు, ధూమ‌పానం వంటివే ప్ర‌ధానమైన‌ కార‌ణాలు కాదని, ప‌లు విష‌యాల‌ను గుర్తు పెట్టుకొని గుండెపోటు ముప్పునుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌న‌కు న‌చ్చ‌ని, తీవ్రంగా వ్య‌తిరేకించే ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు లేదా ఏద‌యినా అకస్మాత్తు ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు విపరీతమైన కోపం, బాధ వంటి తీవ్ర భావోద్వేగాలు కూడా ప‌లుసార్లు గుండెపోటుకు దారితీయవ‌చ్చ‌ని అంటున్నారు. ఆ స‌మ‌యాల్లో గుండెవేగం, రక్తపోటు ఉన్నట్టుండి బాగా అధిక‌మై పోతుంద‌ని దీంతో గుండెపోటు ముప్పు ఉన్న‌వారికి మరింత హానికరంగా పరిణమిస్తాయని వైద్యులు అంటున్నారు.

తీవ్రమైన బాధ, విచారంతో బాధపడుతున్న మహిళల్లోనూ గుండెపోటు ముప్పు ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక‌ శారీరకంగా ఆరోగ్యంగా లేనివారు ఉన్నట్టుండి తీవ్రమైన శారీరకశ్రమ చేయటం వల్ల కూడా గుండెపోటు రావ‌చ్చ‌ని వైద్యులు అంటున్నారు. అలాగే బాగా చలిగా ఉన్న వాతావరణంలో గుండె ధమనులు కుంచించుకుపోతుంటాయని, దీంతో రక్తపోటు పెరిగి కొంద‌రిలో గుండెపోటుకు దారి తీయ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఇక అతిగా తినటంతోనూ గుండెపోటు ముప్పు ఉంటుంద‌ట. క‌డుపు ఉబ్బిపోయేలా తిన‌డం గుండెపోటును ప్రేరేపించవ‌చ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అధికంగా తినటం వల్ల ఎపినెఫ్రిన్‌ అనే హార్మోన్ల స్థాయులు పెగుతాయ‌ని వైద్యులు అంటున్నారు. గుండెపోటుకి రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, ల్యూపస్‌ వంటి జబ్బులు కూడా కార‌ణాలుగా మారుతున్నాయ‌ని, వాటిప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాల‌ని, వైద్యుల సూచ‌న‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News