: భర్త రెండోపెళ్లి చేసుకుంటుండగా వచ్చి బడితెపూజ చేసిన భార్య!
పంజాబ్ లోని లూథియానాలో తనను మోసం చేసిన భర్తకు తగిన శాస్తి చేసిందో ఇల్లాలు. వివరాల్లోకి వెళ్తే... లూధియానాలో ఓ కళ్యాణ మండపంలో వివాహం జరగడానికి సర్వం సిద్ధంగా ఉంది. వరుడు, వధువు తరపు బంధువులంతా వేడుక వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఆ కళ్యాణ మండపం వద్దకు ఓ మహిళ కారులో నలుగురు బంధువులతో కలసి చేరుకుంది. నేరుగా వరుడెక్కడ? అని ఆడపెళ్లివారిని అడిగింది. మేడ మీదున్నాడనడంతో అక్కడికి చేరుకుని, ఎవర్ని మోసం చేస్తావంటూ అందరి ముందూ లెంపలు వాయించింది. కాలర్ పట్టి నిలదీసింది.
ఈ హఠాత్పరిణామంతో మేల్కొన్న వరుడి బంధువులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారికి కూడా రెండు పీకిందా మహిళ. ఇంతలో జరుగుతున్న గలాటాను ఆపేందుకు వచ్చిన కొంత మంది, అసలేం జరుగుతోందని ప్రశ్నించడంతో తాను అతని మొదటి భార్యనని చెప్పింది. దీంతో అంతా షాక్ తిన్నారు. అందరి ముందు భర్తను కొడుతూ కాలర్ పట్టుకుని ఆమె ఈడ్చుకొచ్చింది. ఇంతలో పోలీసులు రావడంతో తాను ఆమెతో విడాకులు తీసుకున్నానని, అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని వరుడు చెబుతున్నా, ఆమె అతనిపై కలబడి చితక్కొట్టడం విశేషం.