: ఐఫోన్ 8 ఎలా ఉంటుందో తెలుసా?...అప్పుడే లీకైన వివరాలివిగో!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐఫోన్ మార్కెట్ లోకి రానుందంటే ఇతర ఫోన్ సంస్థలన్నీ ఏ ఫీచర్లలో ఐఫోన్ మార్కెట్ ను కొల్లగొడుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తాయి. ఆనతి కాలంలో దానికి దీటైన ఫీచర్లు లేని పక్షంలో దానికి దగ్గరగా ఉండే ఫీచర్లతో ఫోన్లను మార్కెట్ లో ప్రవేశపెట్టి వ్యాపారాన్ని పెంచుకుంటాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు విడుదల చేసిన ఐఫోన్ 7 ప్లస్ సిరీస్ కంటే లేటెస్ట్ ఫీచర్స్ తో ఐఫోన్ 8ను విడుదల చేయనున్నట్టు ఆపిల్ ప్రకటించింది. ఈ ఆపిల్ 8 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.
ఈ ఫోన్ ప్రత్యేకత 5.8 అంగుళాల ఓలెడ్ (ఓఎల్‌ఈడీ) డిస్ ప్లే... దీనిని ‘ఐఫోన్ ఎక్స్’గా పిలవనున్నట్టు తెలుస్తోంది. అప్ డేటెడ్ వెర్షన్ అయిన ఇది ఐఫోన్ 7 ప్లస్ కంటే చిన్నగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దీని డిస్ ప్లే 5.8 అంగుళాలుగా చెబుతున్నప్పటికీ... దీని డిస్ ప్లే కేవలం 5.15 అంగుళాలు మాత్రమే ఉండనుంది. మిగిలిన 0.65 అంగుళం ఫంక్షనింగ్ ఏరియాగా ఉంటుంది. ఇది వైర్ లెస్ ఛార్జింగ్ సౌకర్యంతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారు వెయ్యి డాలర్లుగా నిర్ణయించినట్టు లీకైన వార్తలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అని తెలుస్తోంది. దీనితోపాటు ఐఫోన్, ఐపాడ్ తదితర యాపిల్ ఉత్పత్తుల కోసం ‘అల్ట్రా యాక్సెసరీ కనెక్టర్ (యూఏసీ) అనే కొత్త రకం కనెక్టర్ ను విడుదల చేసేందుకు యాపిల్ సిద్ధమవుతోంది.