: డౌన్ లోడ్ స్పీడ్ లో రిలయన్స్ జియోదే మొదటి స్థానం!
ఉచిత మంత్రంతో మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో మొదట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జనవరిలో మిగతా కంపెనీలతో పోల్చితే నాలుగో స్థానానికి పడిపోయింది. కాగా, గత నెలలో మాత్రం జియో మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లో ముందంజలో నిలిచింది. అయితే, 4జీ డౌన్ లోడ్ స్పీడుతో జియో అన్నింటికన్నా ముందుండగా, అప్ లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట. గత నెలలో జియో నెట్ వర్క్ సగటు వేగం 17.427 ఎంబీపీఎస్ కాగా ఐడియా 12.216 ఎంబీపీఎస్, ఎయిర్ టెల్ 11.245ఎంబీపీఎస్, వొడాఫోన్ 8.337ఎంబీపీఎస్‌లతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, గత ఏడాది డిసెంబరులో జియో 18.146 ఎంబీపీఎస్ స్పీడ్ నమోదు చేసుకుంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఆ నెట్‌వర్క్ వేగం తక్కువే. 4జీ అప్ లోడ్‌లో ఐడియా గత నెలలో అగ్రస్థానంలో ఉంది.