: చంద్రబాబు ఈ రోజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు: 'ఓటుకు నోటు కేసు'పై స్పందించిన జగన్
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడి ప్రమేయం ఉందంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం ఈ రోజు ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ రోజు విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ శాసనసభలో ప్రసంగం చేసిన వెంటనే కేవలం అర్ధగంటలో అదే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారని ఆయన అన్నారు. ఓ వైపు గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే 11.10కి సుప్రీంకోర్టులో ఆ కేసుపై వేసిన పిటిషన్ విచారణకు స్వీకరించారని తెలుసుకున్న చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని జగన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రెస్మీట్లో చంద్రబాబు మాట్లాడుతూ... ఇటువంటి కేసులన్నీ మామూలుగా రొటీన్‌గా జరుగుతుంటాయని వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు.
తనపై గతంలో 26 కేసులు పెట్టారంటూ చంద్రబాబు తేలికగా మాట్లాడారని జగన్ అన్నారు. ఒక ముఖ్యమంత్రిపై వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించడం మామూలు విషయం కాదని అన్నారు. ఓటుకు నోటు కేసులో నల్లధనం ఇస్తూ అడ్డంగా పట్టుబడ్డారని ఆయన అన్నారు. ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయి సూట్‌కేసులు మారుస్తూ కెమెరాలకు చిక్కిన చరిత్ర దేశ చరిత్రలోనే లేదని చెప్పారు. అలా జరిగినప్పటికీ చంద్రబాబు రాజీనామా చేయకపోవడం మన దగ్గరే తప్పా ఎక్కడా లేదని అన్నారు. ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పారు. ఏ కేసు వేసినా చంద్రబాబు బాగా మేనేజ్ చేయగలరని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు ఎంత సీరియస్ కేసో చంద్రబాబు నాయుడికి బాగా తెలుసని జగన్ వ్యాఖ్యానించారు.