: ప్లాట్ల కేటాయింపు 'పచ్చ చొక్కా' వాళ్లకు బాగానే జరిగింది!: జగన్ సెటైర్
కొంత మందికి మాత్రమే లాభం చేకూర్చేలా రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు జరిగిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో నిర్మించిన అసెంబ్లీలో తొలి సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్లాట్ల విషయంలో రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. వ్యవసాయ, సేవ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి ఉండాలని, అయితే ఆ దాఖలాలు ఎక్కడా కనపడడం లేదని అన్నారు.
రోడ్లు, పార్కుల పక్కన టీడీపీ నేతల బంధువులకు, మిత్రులకు ప్లాట్లు ఇచ్చారని జగన్ ఆరోపించారు. పలు ప్లాట్ల కేటాయింపు వివరాలని చదివి ఆయన మీడియాకు వివరించారు. రైతులకు మాత్రం ఎక్కడో మారుమూలన ప్లాట్లు ఇచ్చారని చెప్పారు. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పీఏకి కూడా మంచి ప్లేసులో ప్లాటు ఇచ్చారని చెప్పారు. రైతులకి మేలు జరగాల్సిన చోట్ల చంద్రబాబు నాయుడికి వెంట ఉండే నేతల బంధువులకి, మిత్రులకి ప్లాట్లు కేటాయించడం సరి కాదని అన్నారు.
పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు నాలుగువైపులా రోడ్లు ఉన్న స్థలాల్లో ప్లాట్లు ఇచ్చారని అన్నారు. ప్లాట్ల కేటాయింపు పచ్చ చొక్కావాళ్లకు బాగా జరిగిందని ఆయన ఆరోపించారు. ఓవైపు భూములు ఇచ్చి, ఎదురు చూస్తోన్న రైతులకు మాత్రం అన్యాయం చేస్తూ మరోవైపు చంద్రబాబు ఇలా ప్లాట్ల కేటాయింపులను చేస్తున్నారని ఆరోపించారు.