: ప్రేక్షకులను నవ్వించిన రెజ్లింగ్ మ్యాచ్... పరుగందుకున్న అబ్బాయి వెంటపడ్డ అమ్మాయి!
అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ లో కుస్తీ క్రీడను ప్రోత్సహించేందుకు నిర్వహించిన పోటీ స్టేడియంలో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్ ను వీక్షించిన ప్రేక్షకులు గట్టిగా నవ్వడం విశేషం. దానికి కారణమేంటంటే...చిన్నపిల్లల కేటగిరీలో నిర్వహించిన కుస్తీ పోటీలో 5 ఏళ్ల బాలికతో 4 ఏళ్ల ఐజాక్ లెన్ బెర్రీ కుస్తీకి సిద్ధమయ్యాడు. ఎలాంటి దెబ్బలు తగలకుండా రక్షణ పరికరాలు ధరించి మ్యాచ్ కు సిద్ధమయ్యాడు. ఇద్దరికీ తల్లిదండ్రులు, రిఫరీ రూల్స్ వివరించారు. సర్కిల్ దాటి వెళ్లకూడదని సూచించారు. రిఫరీ మ్యాచ్ కు ఓకే చెప్పగానే ఇద్దరూ చేతులు కలిపారు. తరువాత రెడీ అనగానే ఐజాక్ పరుగెత్తడం మొదలుపెట్టాడు. దీంతో 5 ఏళ్ల బాలిక కూడా అతని వెంట పరుగెత్తడం ప్రారంభించింది.
ఇలా ఇద్దరూ పరుగెడుతుంటే చూసిన వీక్షకులు నవ్వేశారు. మధ్యలో సర్కిల్ లోకి ఐజాక్ రాగానే అతనిని బాలిక ఒక పట్టు పట్టేసింది. అయితే బోర్లాపడ్డ ఐజాక్ ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్ చేసి విడిపించుకుని మళ్లీ పరుగెత్తడం మొదలుపెట్టాడు. దీంతో మళ్లీ వీక్షకుల్లో నవ్వులు పూశాయి. మ్యాచ్ లో బాలికే విజయం సాధించినప్పటికీ... ఐజాక్ తల్లి అలెక్సీ ఎందుకలా పరుగెత్తావు? అని ప్రశ్నిస్తే... తెలియదమ్మా...అలా పరుగెడుతుంటే సరదాగా అనిపించింది, అందుకే పరుగెత్తానని సమాధానమిచ్చాడు. 53 సెకెన్ల నిడివిగల ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోను ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేయగా, ఆ వీడియో వైరల్ అవుతోంది. అంతా దానిని ఆసక్తిగా చూస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను వీక్షించండి.