: ముంబై దాడుల్లో పాక్ ఉగ్రవాద సంస్థల హ‌స్తం ఉంది: పాకిస్థాన్‌ మాజీ భ‌ద్ర‌తాధికారి


ఈ రోజు ఢిల్లీలో జ‌రిగిన 19వ ఆసియా భ‌ద్ర‌తా స‌ద‌స్సులో పాకిస్థాన్‌ మాజీ భ‌ద్ర‌తాధికారి మ‌హ‌ముద్ అలీ దురాని పాల్గొని మాట్లాడుతూ..  2008 ముంబై ఉగ్ర‌దాడుల అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హ‌స్తం ఉంద‌ని చెప్పారు. పాక్‌కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ సీమాంత‌ర ఉగ్ర‌వాదానికి పాల్ప‌డింద‌ని, సెప్టెంబ‌ర్ 26న జ‌రిగిన దాడికి కుట్ర ప్ర‌ణాళిక‌ కూడా పాక్‌లోనే జ‌రిగింద‌ని చెప్పారు.

ఇదే స‌మావేశంలో పాల్గొన్న ఆఫ్ఘ‌నిస్తాన్ ఎన్ఎస్ఏ అధికారి మొహ‌మ్మ‌ద్ హ‌నీఫ్ అత్మ‌ర్ మాట్లాడుతూ ల‌ష్క‌రే తోయిబా, జైషే మొహ‌మ్మ‌ద్ సంస్థ‌లు ఆప్ఘ‌నిస్థాన్‌కి శ‌త్రువులేన‌ని తెలిపారు. అటువంటి సంస్థ‌ల‌కు త‌మ దేశం ఆశ్ర‌యం ఇవ్వ‌బోద‌ని చెప్పారు. పాకిస్థాన్ కూడా ఆ సంస్థ‌ల‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌ద‌ని తాము ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్టేందుకు అంత‌ర్జాతీయంగా భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్న‌ప్ప‌టికీ త‌మ దేశంతో పాటు పాకిస్థాన్‌లో ఉగ్ర‌వాదులు త‌మ ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. పాక్‌లోనే అత్య‌ధికంగా ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని ఆఫ్ఘ‌నిస్తాన్ అభిప్రాయ‌ ప‌డింది.

అనంత‌రం భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ మాట్లాడుతూ... ప్ర‌పంచ దేశాల‌కు ఉగ్ర‌వాద స‌మ‌స్య పెద్ద‌ స‌వాల్‌గా మారింద‌ని అన్నారు. ఉగ్ర‌వాదాన్ని అణ‌చివేసేందుకు అన్ని దేశాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని అన్నారు. అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త అనే అంశాలనే అతిపెద్ద స‌మ‌స్య‌లుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. సీమాంత‌ర ఉగ్ర‌వాదం వల్ల ఆఫ్ఘ‌నిస్తాన్‌తో పాటు భార‌త్ న‌ష్ట‌పోయింద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News